ఒడిశాలో అరుదైన ఆరంగుటాన్లు.. ఏపీలో పునుగు పిల్లి

September 09, 2026
img

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బిచిత్రాపూర్ అటవీ ప్రాంతంలో ఐదు చిన్న ఆరంగుటాన్లు కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. బడపాయి గ్రామం సమీపంలోని అడవిలో స్థానికులు వీటిని గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ సిబ్బంది వాటిని సురక్షితంగా రక్షించారు.

ఆరంగుటాన్లు భారత్‌కు చెందినవి కావు. ఇవి ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా ప్రాంతాల్లోని వర్షారణ్యాల్లో కనిపిస్తాయి. కనుక అవి వాటంతట అవి ప్రయాణించి బాలాసోర్‌ అడవులకు చేరుకోలేవు, కనుక బహుశః వన్య ప్రాణులను స్మగ్లింగ్ చేసే ముఠాలు వీటిని భారత్‌కు తెచ్చి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

అయితే వాటిని అంత దూరం నుంచి తీసుకువచ్చి ఇక్కడ అడవులలో ఎందుకు విడిచిపెట్టేశారు? లేదా వాటి తల్లితో పాటు అవి తప్పించుకొని బయటపడ్డాయా? అనే కోణంలో వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.  

ఐదు ఆరంగుటాన్లలో నాలుగు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి. మరొకటి కాస్త బలహీనంగా ఉంది. కనుక వాటిని అటవీశాఖ పర్యవేక్షణలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తర్వాత వాటిని భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌కు తరలించబోతున్నారు. .

ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా మంగళగిరి కొండలలో చాలా అరుదైన పునుగు పిల్లి కనిపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకొని, దానిని తిరుమల శేషాచలం అడవులకు తరలించబోతున్నట్లు సమాచారం. ఈ పునుగు పిల్లి గ్రంధుల నుంచి ‘జవాది’ అనే అత్యంత సుగంధ భరితమైన ద్రవ్యం లభిస్తుంది. దానిని తిరుమల శ్రీవారి సేవలో ఉపయోగిస్తుంటారు. 

Related Post