సినీ పరిశ్రమ హీరోల అభిమానులంటే సామాన్య ప్రజలలో కాస్త వ్యతిరేకతే కనిపిస్తుంటుంది. వారు ప్రదర్శించే అత్యుత్సాహమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతూ అందరి ఆదరణ పొందుతున్నారు. చివరికి అల్లు అర్జున్ సైతం వారిని చూసి గర్వపడేలా చేశారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో గల ప్రభుత్వ పాఠశాలలో మూడు లక్షల మంది బాలికలకు ‘హెచ్‌పీవి వ్యాధి’ లక్షణాలు, వాటిని గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాక్సినేషన్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
‘హెచ్‌పీవి వ్యాధి’ సెక్స్‌లో పాల్గొనే వారిలో చాలా మందికి వస్తుంది. పూర్తి ఆరోగ్యవంతులలో కూడా ఇది కనపడుతుంటుంది. దీనిలో 200 రకాలున్నాయి. మళ్ళీ ఈ వ్యాధిలో లోరిస్క్, హైరిస్క్ అని రెండుగా విభజించబడ్డాయి. లోరిస్క్ ఉన్నవారిలో ఈ వ్యాధి లక్షణాలు పెద్దగా బయటపడవు. ఒకవేళ బయటపడినా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దానిని ఎప్పటికప్పుడు నిర్మూలిస్తుంది. ఒక్కోసారి వీటికి మందులతో చికిత్స చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. హైరిస్క్ ఉంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధికి దారి తీస్తుంది. కనుక ఈ వ్యాధి గురించి అవగాహన చాలా ముఖ్యం. అల్లు అర్జున్ అభిమానులు అదే కల్పించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 820 కార్యక్రమాలు చేపట్టారు. అల్లు అర్జున్ అభిమానుల స్పూర్తితో మిగిలిన హీరోల అభిమానులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది.