తెలంగాణ శాసనసభ సమావేశాల నేపధ్యంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య సాగిన రాజకీయ పోరాటాలలో మాజీ మంత్రి కొండా సురేఖ తొలగింపు, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల వ్యవహారం పక్కకు పోయింది.
కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల యుద్ధ జ్వాలలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో మళ్ళీ వారిద్దరి గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆమె తొలగింపుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే, కొండా సురేఖ, ఆమె కుమార్తె ఆరోపణలతో సిఎం రేవంత్ రెడ్డి చాలా బాధపడ్డారు. అందువల్లే ఆమెను పదవిలో నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం వద్ద గట్టిగా పట్టుబట్టారు. లేకుంటే రాజకీయ వర్గాలలో తాను చులకన అవుతానని చెప్పుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన అభీష్టం మేరకు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు అంగీకరించింది.
ఈ సందర్భంగా ఆమె నాపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నించారు. నేను ఏనాడూ సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వ్యక్తిగతంగా ఆయనని దూషించలేదు. కేవలం విధానపరంగానే ఆయనతో విభేదించాను తప్ప ఆయనతో నాకు ఎటువంటి శత్రుత్వం లేదు.
నేను మంత్రి పదవి ఆశించి ఈవిదంగా మాట్లడుతున్నానని కొందరు విమర్శిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. మంత్రి పదవి రాసిపెట్టి ఉంటే వస్తుంది లేకుంటే లేదు. మా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సంతోషంగా చేపడతాను,” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
కొండా సురేఖ తొలగింపుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, “ఆమె తొలగింపుకి వేరే బలమైన కారణం ఉంది. 22ఏ భూముల వ్యవహారం వల్లనే ఆమె మంత్రి పదవి ఊడింది,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కానీ దానికీ ఆమెకు ఏవిధంగా సంబంధమో ఆయన వివరించలేదు. కానీ సిఎం రేవంత్ రెడ్డి 22ఏ పేరుతో రాష్ట్రంలో కోటి ఎకరాలు మాయం చేసేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.