తెలంగాణ రాజకీయాలలో నైతిక విలువలు నానాటికీ దిగజారుతూనే ఉన్నాయి. శాసనసభ వద్ద మహిళా ప్రజా ప్రతినిధులు, మీడియా ముందు హరీష్ రావు తదితరులు చొక్కాలు విప్పేసి నిరసనలు తెలుపడం, ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతల మద్య వారు ఇబ్బందిపడటం, వారితో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం వంటివి ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి.
ఇదే తప్పనుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తాను కేసీఆర్ చావు కోరుకుంటున్నానని చెప్పడం, ఎర్రవల్లి ఫామ్‌హౌసు వద్ద కొందరు చావు డప్పు కొట్టడం వంటివి చూస్తున్నప్పుడు తెలంగాణ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయాయని బాధ కలుగుతుంది.
తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
శాసనసభ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు హడావుడి చేస్తున్నప్పుడు, తాను అక్కడే విధులు నిర్వహిస్తున్నాని, అప్పుడు జరిగిన తోపులాటలలో కేటీఆర్, హరీశ్‌రావు, మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళా కానిస్టేబుల్ పిర్యాదు చేశారు.
పోలీసులు తమ మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యం చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లే, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడాన్ని రాజకీయ కోణంలో నుంచే చూడాల్సి ఉంటుంది.
ఏది ఏమైనప్పటికీ, బీఆర్ఎస్ పార్టీకు మూల స్తంభాలు వంటి వారిరువురిపై ఇలాంటి కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి.. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కూడా.