నేడు పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో బలూచిస్తాన్ హోంమంత్రి కాన్వాయ్‌పై కొందరు సాయుధులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో మంత్రి మీర్ జియాఉల్లా లంగో గాయపడకుండా తప్పించుకోగలిగారు. కానీ ఆయన భద్రతా సిబ్బందిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడినట్లు పాక్ మీడియా తెలిపింది.
ఆయన కలాత్‌లో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి క్వెట్టాకు వెళుతున్నప్పుడు ఆయన కాన్వాయ్ మస్తుంగ్ జిల్లాలోని ఖడ్‌కోచా వద్దకు చేరుకోగానే అప్పటికే పొంచి ఉన్న సాయుధులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. సుమారు 20 నిమిషాల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం.
కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భద్రతా బలగాలు భారీగా గాలింపు చేపట్టాయి. గాయపడిన ఆరుగురు పోలీసులను మస్తుంగ్‌లోని ఆసుపత్రికి తరలించగా.. ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం క్వెట్టాకు తరలించారు.
హోంమంత్రి జియా లంగో స్పందిస్తూ, “ఇలాంటి పిరికిపందల దాడులకు నేను భయపడబోను. తుపాకీ కాల్పులు మా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు,” అని అన్నారు.