అయ్యో! మేడిగడ్డ కథ మళ్ళీ మొదటికొచ్చిందే!

October 15, 2026


img

మాజీ సిఎం కేసీఆర్‌ హయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాకులోని మూడు పిల్లర్లు, ఆయన అధికారంలో ఉండగానే క్రుంగిపోయాయి. 

అవి క్రుంగిపోయినందున మేడిగడ్డ బ్యారేజ్‌లో మిగిలిన  గేట్లు దెబ్బ తినకుండా ఉండేందుకు అన్ని గేట్లు ఎత్తేసి ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చే గోదావరి వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ విషయంలో అప్పటి నుంచి కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల మద్య వాదోపవాదాలు సాగుతూనే ఉన్నాయి. 

అయితే మేడిగడ్డ బారాజ్‌ ప్రజల భద్రత, ఆర్ధిక అంశాలతో ముడిపడి ఉన్నందున, ఈ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ నిపుణులతో అవసరమైన అన్ని పరీక్షలు చేయించి వారి సూచనల ప్రకారమే ముందుకు సాగాలని నిర్ణయించింది. 

తాజా సమాచారం ప్రకారం మేడిగడ్డ బారాజ్‌ పునరుద్ధరణ పనులపై సాంకేతిక పర్యవేక్షణ కమిటీ కీలక సూచనలు చేసింది. 

కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ పనుల కోసం రూపొందించిన ప్రాథమిక డిజైన్లు, డ్రాయింగులను కమిటీ బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పరిశీలించింది. వాటిలో పలు మార్పులు సూచించింది. ఆ ప్రకారం మూడు వారాల్లోగా సమగ్ర డిజైన్లు సిద్ధం చేసి సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. 

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల భద్రతను మెరుగుపరిచేందుకు ఎగువ, దిగువ ప్రాంతాల్లో డయాఫ్రమ్‌ గోడలు నిర్మించాలని సూచించింది. దిగువన నీటి వేగాన్ని తగ్గించేందుకు స్టిల్లింగ్‌ బేసిన్‌లను విస్తరించాలని, పునాదుల కింద నుంచి నీరు ప్రవహించకుండా కొత్త కట్‌ఆఫ్‌ గోడలు నిర్మించాలని ప్రతిపాదించింది. 

మేడిగడ్డ బరాజ్‌లోని మొత్తం 85 పిల్లర్లను కవర్‌ చేసేలా స్టిల్లింగ్‌ బేసిన్‌ను పొడిగించాలని కమిటీ సూచించింది. తీవ్రంగా దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని మూడు పిల్లర్లను పునాదులతో సహా తొలగించి, తిరిగి నిర్మించాల్సి ఉంటుందని సూచించినట్లు తెలుస్తోంది. 

దాని సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం సంబందిత అధికారులు, నిపుణులతో చర్చిస్తోంది.ఈ బ్లాక్‌ను పూర్తిగా తొలగించి మళ్ళీ మూడు గేట్లతో పునర్నిర్మించడమా, లేదా మూడు గేట్లకు బదులు మొత్తం కాంక్రీట్‌ గోడ నిర్మించడమా? ఏది మంచిదని చర్చిస్తున్నారు.

అలాగే నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ చేసిన ఇతర సూచనలపై కూడా చర్చించి తదనుగుణంగా నిర్ణయం తీసుకొని మళ్ళీ కొత్త ప్రణాళికలు రూపొందించే పనిలో పడినట్లు తెలుస్తోంది. కనుక మేడిగడ్డ బారాజ్‌ కథ మళ్ళీ మొదటికొచ్చినట్లే భావించవచ్చు. 


Related Post