తెలంగాణ ఏసీబీ వలలో మరో రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. ఈసారి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసులును ఏసీబీ అధికారులు వలేసి పట్టుకున్నారు.
మండలంలో హెచ్ఎండిఎ పరిధిలోని ఓ లే అవుట్‌ను సర్వే చేసి ఎన్‌ఓసి (నో అబ్జక్షన్ సర్టిఫికేట్) ఇచ్చేందుకు వారు రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
కానీ సదరు రియల్ ఎస్టేట్ యజమాని అంత ఇచ్చుకోలేనని బ్రతిమాలుకోగా చివరకు రూ.20 లక్షలకు అంగీకరించారు. ఆ తర్వాత సదరు రియల్ ఎస్టేట్ యజమాని ఏసీబీకి ఈ సమాచారం అందించగా, ఏసీబీ అధికారులు తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసులు ఆ సొమ్ము తీసుకొంటుండగా రెడ్ హేండడ్‌గా పట్టుకున్నారు.
వారిరువురిపై కేసు నమోదు చేశారు. కానీ ఏసీబీ అధికారులు వారిని అంతటితో వదిలేయలేదు. వారిరువురూ ఈ స్థాయిలో లంచాలు తీసుకున్నట్లు రుజువైంది కనుక వారి ఇళ్ళు, వారి సమీప బంధువుల ఇళ్ళలోనూ నేడు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా వారికి భారీగా నగదు, స్థిరాస్తులకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకునట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా 2019, నవంబర్ 4వ తేదీన ఇదే కార్యాలయంలో జరిగిన ఓ విషాద ఘటన అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు.
అప్పటి మహిళా తహశీల్దార్ విజయారెడ్డి కూడా ఇదేవిధంగా లంచాల కోసం అందరినీ వేధిస్తుంటే, ఆమె వేధింపులు భరించలేక గౌరెల్లి గ్రామానికి చెందిన కూర సురేష్ అనే వ్యక్తి ఆమెను ఇదే కార్యాలయంలో పెట్రోల్ పోసి నిప్పంటించి తగులబెట్టాడు.
ఆమె ఘటనా స్థలంలోనే చనిపోగా, నిందితుడు సురేష్ కుమార్, ఆమెను కాపాడబోయిన డ్రైవర్ చంద్రయ్య తీవ్రంగా గాయాలపాలై చికిత్స పొందుతూ చనిపోయారు.
మరోపక్క తెలంగాణ ఏసీబీ అధికారులు ఇటీవల తరచూ ఈవిధంగా వల పన్ని పలువురిని రెడ్ హేండడ్‌గా పట్టుకుంటూనే ఉన్నారు. అయినా అధికారులు ఎవరూ అవినీతికి పాల్పడేందుకు భయపడటం లేదు.