తెలంగాణలో శనివారం నుంచి బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ పండుగ రెండో రోజైన నేడు మహిళలు అటుకుల బతుకమ్మను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నేడు అటుకులు, సప్పిడి పప్పు, బెల్లంతో చేసిన పిండివంటను బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. కనుక నేడు అమ్మవారిని అటుకుల బతుకమ్మగా కొలుస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.
ఉదయం బతుకమ్మలను పూలతో అందంగా అలంకరించి, పిండివంటలు నైవేద్యం సమర్పించిన తర్వాత, సాయంత్రం మహిళలు తయారు చేసిన బతుకమ్మలను ఒకచోట పెట్టి, వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతారు.
కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మహిళల ఆటపాటలతో తెలంగాణ రాష్ట్ర మంతటా ముఖ్యంగా గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది.
ప్రకృతితో మానవ సంబంధాన్ని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటి చెప్పే ఈ బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా సందడిగా సాగుతున్నాయి.