పెత్తరమాసంలో అమరవీరులకు బియ్యమిచ్చిన కోదండరాం

October 10, 2026


img

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శనివారం గన్‌పార్క్‌లో నివాళులర్పించారు. అనంతరం పెత్తరమాసం (మహాలయ పిత్రుపక్షం) సందర్భంగా అమరవీరులకు బియ్యం సమర్పించారు. 

తెలంగాణలో పెత్తరమాసం సందర్భంగా పూర్వీకులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించేందుకు కూడా ఉపయోగిస్తున్నామని కోదండరాం పేర్కొన్నారు. 

రాష్ట్ర సాధన కోసం వారు చేసిన త్యాగాలను మరిచిపోవడం క్షమించరాని నేరమని, వారి త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున వారి పట్ల నేటి తరం, భావి తరాలు కూడా ఎల్లప్పుడూ గౌరవం చూపాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారి బలిదానాల గురించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ సాధించుకున్నంత మాత్రాన అమరవీరుల ఆశయాలు పూర్తిగా నెరవేరినట్లు కాదని, వారు కోరుకున్న సమాజ నిర్మాణం కోసం ఇంకా కృషి చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

గన్ పార్క్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీజేఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.


Related Post