నేటి నుంచి బతుకమ్మ సంబురాలు

October 10, 2026
img

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ముఖ్యంగా మహిళల మనోభావాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రారంభమైంది.

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలు అక్టోబర్‌ 18న సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. తొలి రోజైన నేడు మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు.

బతుకమ్మ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించారు.

పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ వేడుక అని, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కేరళలో ఓనం పండుగకు ఉన్న గుర్తింపు తెలంగాణలో బతుకమ్మకు ఉంది. ఈ వేడుకలను వీక్షించేందుకు పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అక్టోబర్‌ 18న సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు.

ఆ రోజు సాయంత్రం అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మల ఊరేగింపు జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, కళాకారులు పాల్గొననున్నారు.

Related Post