చారిత్రిక నవలా చక్రవర్తిగా పేరుగాంచిన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ (85) హైదరాబాద్‌లో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన 1940లో ప్రకాశం జిల్లాలోని ఆకులల్లూరులో జన్మించారు. సికింద్రాబాదులోని వెస్లీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాడుగా పనిచేశారు. ఆ తర్వాత 1970 నుంచి 2000 వరకు ముప్పై ఏళ్ళపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యుడిగా పనిచేశారు.
ఆయన చరిత్రను కేవలం తేదీలు, యుద్ధాలుగా కాకుండా మానవ సంబంధాలు మరియు భావోద్వేగాలతో నవలలుగా మలిచారు. ఆవాహన, శ్రీపాదార్చన, పట్టాభి, రెసిడెన్సీ, శ్రావణి, శ్రీలేఖ, వంశధార, రోహణం వంటి కొన్ని చారిత్రక నవలలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలలే కాకుండా ప్రాచీన గ్రీకు సాహిత్యం, తత్వశాస్త్రం మరియు క్రైస్తవ అష్టకం పేరిట ఎనిమిది పుస్తకాల శ్రేణిని కూడా రాశారు.
కేంద్ర సాహిత్య అకాడమీ కోసం పాల్కురికి సోమనాథునిపై ఒక ప్రత్యేక గ్రంథాన్ని కూడా ఆయన రూపొందించారు. ఆయన రాసిన పలు నవలలు వివిధ విశ్వవిద్యాలయాలలో పాఠ్యపుస్తకాలుగా గుర్తింపు పొందాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమతో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమాకు ఆయన స్క్రిప్ట్ సహాయకుడిగా వ్యవహరించారు.
ఆయన రాసిన ‘స్వప్న కిరీటం’ నవల ఆధారంగా ‘దశ తిరిగింది’ అనే సినిమా వచ్చింది. అలాగే ‘చంద్రకళ’ అనే నవల ఆధారంగా సమ్మక్క సారక్కలపై ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందింది.
చలనచిత్ర రంగ ప్రముఖులతో తనకున్న అనుభవాలను మరియు జ్ఞాపకాలను ఆయన జ్ఞాపకాల ‘పల్లకి’ అనే పుస్తకంలో భద్రపరిచారు.
ఆరు దశాబ్దాలకు పైగా సాగిన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ సాహిత్య ప్రస్థానంలో వందకు పైగా పుస్తకాలు రాశారు. అందులో ఇరవైకి పైగా చారిత్రక నవలలు ఉన్నాయి. ఆయన చారిత్రిక నవల చదవటమంటే ఆకాలంలోకి పయనించడమే అనేవారు. కనుక ప్రాచీన చరిత్రను, రాజుల గాథలను, సాంస్కృతిక వారసత్వాన్ని సామాన్య పాఠకులకు సైతం అర్థమయ్యే సరళి, భాషలో అందించారు.