కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద మళ్ళీ నిరసన కార్యక్రమం ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సీజేపీ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఢిల్లీ నగర వ్యాప్తంగా సుమారు 40,000 మంది పోలీసులను మోహరించారు. బయట నుంచి ఎవరూ ఢిల్లీలో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించి అక్కడ కర్ఫ్యూ కూడా విధించారు.
నిరసనకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద తనిఖీలు పెంచారు. హజ్రత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లలో ఆంక్షలు విధించారు. కొన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు సమాచారం.
ఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేయాలని పోలీసులు మెట్రో అధికారులను కోరారు.
ఈ ఆంక్షలు ఎన్ని రోజులు కొనసాగుతాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. కనుక వీటితో ఢిల్లీ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవకుండా ప్రజారవాణా వ్యవస్థలను యధావిధిగా నడిపించాలని సుప్రీంకోర్టు సూచించింది. సబందిత అధికారులు అందుకు తగ్గ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో యుద్ధానికి ముందు ప్రశాంతత నెలకొన్నట్లు ఉంది. రేపు ఢిల్లీలో ఏం జరగబోతోందో?