బారికేడ్‌ ఎక్కి.. జెండా ఊపిన రాహుల్‌..

October 06, 2026


img

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి మంగళవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. 

పార్లమెంట్‌ నుంచి కేంద్ర ఎన్నికల కమీషన్‌ కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు మార్చ్‌ నిర్వహించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు నీతి ఆయోగ్‌ కార్యాలయం సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

పోలీసులు వారిని ముందుకు కదలనీయకపోవడంతో రాహుల్‌ గాంధీ బారికేడ్‌ పైకి ఎక్కి దానిపై నిలబడి జాతీయ జెండా ఊపుతూ ఆవేశంగా నినాదాలు చేశారు. ఆయనతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, మరికొందరు ప్రతిపక్ష ఎంపీలు కూడా బారికేడ్లు ఎక్కారు. 

అనంతరం రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఆకాశవాణి భవన్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో లక్షలాది ఓటర్లను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చిన్నగా మొదలైన ఈ ఆందోళన ఈ విషయంలో ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసే వరకు వచ్చింది. 

నేడు జరిగిన ర్యాలీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. 

రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదివరకు సీజేపీ ఇలాగే ఆందోళనలు చేపట్టినప్పుడు, ఆ ఒత్తిడితో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కనుక ఈసారి జ్ఞానేశ్‌ కుమార్‌ కూడా రాజీనామా చేస్తారా? లేక కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనలను ధీటుగా ఎదుర్కొని ఆయనని కాపాడుకుంటుందా? రాబోయే రోజుల్లో చూస్తాము.


Related Post