సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనకు వస్తుంటే, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కేరళ పర్యటనకు వెళ్ళిపోయారు.
బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న విమర్శలకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలోనే బహిరంగ సభలు నిర్వహిస్తానని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఆ ప్రకారమే నేడు ముందుగా సిరిసిల్లలో పర్యటిస్తున్నారు.
ఈరోజు సాయంత్రం కరీంనగర్ నుంచి హెలికాఫ్టర్‌లో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజికు చేరుకుంటారు. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాదయాత్ర చేసి రంగినేని ట్రస్ట్ సమీపంలో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచే వర్చువల్‌గా రూ.345.78 కోట్లు విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు.
సిరిసిల్లలో నేతన్నల సమస్యలు, రైతు భరోసా, రుణమాఫీ, భూవ్యవహారాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ ఇటీవల సిఎం రేవంత్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ వ్రాశారు. ఆయనకు సమాధానం చెప్పేందుకే తాను సిరిసిల్ల వస్తే కేటీఆర్ తోక ముడిచి కేరళ పారిపోయారని సిఎం రేవంత్ రెడ్డి నేటి సభలో ఎద్దేవా చేయకుండా ఉండరు.
అయితే కేటీఆర్ కేరళ పర్యటన ఇదివరకే ఖరారు అయ్యింది. అక్కడ ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్-2026లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకొని వెళ్ళారు. కనుక ఇక్కడ సిఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో ఆయనపై విమర్శలు చేస్తుంటే, అక్కడ ఆ జాతీయ వేదికపై కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తారా? లేక సంయమనం పాటిస్తారా? అనేది మరికొన్ని గంటలలో స్పష్టత వస్తుంది.
కొచ్చి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి @KTRBRS
— BRS Party (@BRSparty) September 30, 2026
ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2026లో పాల్గొననున్న కేటీఆర్
“Telangana State – Formation to Transformation” అంశంపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. pic.twitter.com/PcQDTvhWku