కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తోందో?

September 26, 2026


img

గత ఆరేడు నెలలుగా రాష్ట్రంలో సాగునీటి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేపదే తన ప్రత్యర్ధి బీఆర్ఎస్‌ పార్టీకి దొరికిపోతూనే ఉంది. ప్రతీసారి బీఆర్ఎస్‌ పార్టీ హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం హడావుడిగా పంపులు ఆన్‌చేసి నీళ్ళు ఎత్తిపోయడం, జలాశయాలు నింపడం, పంటలకు విడుదల చేయడం జరుగుతోంది. బీఆర్ఎస్‌ పార్టీ చేత కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పించుకోవడం ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

జూరాల ప్రాజెక్టు వద్ద రైతులు, బీఆర్ఎస్‌ పార్టీ హడావుడి చేసిన తర్వాత ప్రభుత్వం హడావుడిగా మంత్రులను కర్ణాటకకు  పంపించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మూడు టీఎంసిల నీళ్ళు విడుదల చేయించింది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న అన్నపూర్ణ పంప్‌హౌస్‌లోని పంపులను ఆన్‌ చేసి రంగనాయక సాగర్ జలాశయం నింపి, రైతులకు నీరు అందించాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి పెద్ద లేఖ వ్రాశారు. ఆ తర్వాతే అన్నపూర్ణలోని రెండు పంపులను ఆన్‌ చేసి 6,400 క్యూసెక్కుల గోదావరి జలాలను అనంతగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఆ తర్వాతే రంగనాయక సాగర్ పంప్‌హౌస్‌లోని రెండు పంపులు ఆన్‌ చేసి 6,600 క్యూసెక్కుల గోదావరి జలాలను రంగనాయక సాగర్ జలాశయంలో నింపుతున్నారు. 

ఏదో ఒకసారి ఇలా జరిగితే ఏమరపాటు వలన జరిగిందని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రతీసారి ఇలాగే ఎందుకు జరుగుతోంది? దీని వలన కాంగ్రెస్‌ ప్రభుత్వానికే చెడ్డపేరు, బీఆర్ఎస్‌ పార్టీకి రైతులలో మంచి పేరు వస్తుంది కదా?

అధికార యంత్రాంగమంతా ప్రభుత్వం చేతిలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షం గుర్తుచేసి, నీళ్ళ కోసం ఆందోళనలు చేస్తామని హెచ్చరించే వరకు ఎందుకు జాప్యం చేస్తోంది? ఎప్పటికప్పుడు వరద నీటిని ఎత్తిపోసుకొని జలాశయాలు నింపి రైతులకు సాగునీరు అందిస్తే కాంగ్రెస్‌ పార్టీకే మంచిపేరు వస్తుంది కదా?  



Related Post