అంగరంగ వైభవంగా ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర

September 25, 2026
img

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవం ఘనంగా కొనసాగుతోంది. నగరంలోని  అన్ని ప్రధాన ప్రాంతాలలో ఏర్పాటు చేసిన  గణనాథులతో పాటు ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన యాత్ర కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే ప్రారంభం కావాల్సిన ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర, క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొంత ఆలస్యమైంది. కానీ తర్వాత మహాగణపతి శోభాయాత్ర వేలాదిమంది భక్తుల జైజై నినాదాల మధ్య సాఫీగా సాగుతోంది. ఉదయం 11 గంటలకు టెలీఫోన్ భవన్‌లో దాటి ముందుకు సాగుతోంది. సవివాయం మీదుగా టాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన 4వ క్రేన్ వద్దకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ఈసారి శోభాయాత్రలో డీజేలకు బదులుగా నాదస్వరం మేళతాళాలతో గణేశుడిని సాగనంపుతున్నారు. నగర వ్యాప్తంగా వేలాది విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తుండటంతో 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో కూడా నిఘా కొనసాగుతోంది. శోభాయత్రలో మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించే ఆకటాయిలను, మహిళల మెడలో గొలుసులు దొంగతనాలు చేసేవారిని గుర్తించి పట్టుకునేందుకు షీ టీమ్స్ కూడా రంగంలో దిగాయి. 

శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించి వాహనాలను ఇతర మార్గాలలోకి మళ్ళిస్తున్నారు. శోభాయాత్రకు నగరం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వారి సౌకర్యార్ధం హైదరాబాద్‌ మెట్రో, ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ అదనపు సర్వీసులు నడిపిస్తున్నాయి. 

Related Post