బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం మరోసారి రికార్డు సృష్టించింది. ఏటా ఉత్కంఠగా సాగే ఈ వేలం పాటలో ఈసారి సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
గత ఏడాది బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈసారి మరో రూ.4 లక్షలు అధికంగా ధర పలికింది.
1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.. మూడు దశాబ్దాల్లో లక్షలు, కోట్లకు చేరువయ్యే స్థాయిలో ఆసక్తిని పెంచుకుంది.
బాలాపూర్ లడ్డూను దక్కించుకుంటే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల్లో విశ్వాసం ఉంది. దీంతో వేలం పాటలో పాల్గొనేందుకు ఏటా పలువురు పోటీ పడుతుంటారు.
వేలం ద్వారా వచ్చిన కొంత మొత్తాన్ని బాలాపూర్ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.
లడ్డూ ప్రసాదం వేలంపాట ముగిసిన తర్వాత బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర మొదలైంది. దీనిలో పాల్గొనే భక్తులకు పలు సంస్థలు, రాజకీయ ప్రముఖులు చల్లటి నీళ్ళు, మజ్జిగ అందిస్తున్నారు.