మీర్‌పేట్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం..

September 24, 2026
img

 వార్తలలో ‘ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు’ అంటే అది అగ్నిప్రమాదానికి సంబందించిన వార్తే అయ్యుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ వాస్తవం మాత్రం ఇదే.  

హైదరాబాద్‌, మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. గాయత్రినగర్‌ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

నాగోల్‌కు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన సుమారు 150 మంది మూడు బస్సుల్లో శ్రీశైలం బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటలకు పెట్రోల్‌ బంక్‌ వద్ద రెండు బస్సులను నిలిపి డీజిల్‌ నింపుతున్నప్పుడు, వాటికి కాస్త దూరం రోడ్డు పక్కన నిలిపి ఉంచి మూడో బస్సు ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలను గమనించిన డ్రైవర్‌ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ బస్సులో నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు సంభవించలేదు.

ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Related Post