ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారే పరిస్థితి కనిపిస్తున్నందున రాబోయే రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల కలెక్టర్లతో పరిస్థితి, ముందస్తు జాగ్రత్త చర్యల గురించి చర్చించారు. జిల్లా కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా యంత్రాంగం అవసరమైన సహాయ సామగ్రితో సిద్దంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అవసరంమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
వరద పరిస్థితులపై జిల్లాలో సంబందిత శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. ప్రజలు కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న వివరాలను బట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ళలో నుంచి బయటకు రావాలని కోరారు. ముఖ్యంగా వాగులు, చెరువులు, వరద నీరు ప్రవహిస్తున్న వంతెనల వైపు వెళ్ళవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాబోయే రెండు రోజులలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.