ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్యపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్‌ను ఫోన్‌లో కోరారు.
రాష్ట్రంలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించి, తక్షణమే జూరాలకు ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని సిఎం కోరారు. అందుకు కర్ణాటక సిఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇటీవల వనపర్తి జిల్లాలో రైతులు నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
ఆ తర్వాత వారు జూరాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు. కానీ అధికారులు మళ్ళీ గేట్లు మూయించేసి, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో రైతులు జూరాల వద్ద ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ నిలవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. తాజాగా బీజేపీ నేతలు కూడా రైతులకు మద్దతుగా రంగంలోకి దిగడంతో ఈ సమస్య ఇంకా పెద్దదైంది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కర్ణాటక సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎంతో చర్చించేందుకు ఈరోజు బెంగళూరు బయలుదేరి వెళ్తున్నారు. రాత్రి 8 గంటలకు వారు సిఎం శివకుమార్‌తో భేటీ కానున్నారు.