ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఆయన ఇంకా ఆ షాక్ నుంచి తేరుకున్నట్లు లేరు. నిన్న తీర్పు వెలువడిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి ఏదైనా మాట్లాడాతారనుకుంటే, అయన మీడియా ప్రతినిధులను కలవడానికి ఇష్టపడలేదు. తర్వాత కొద్ది మందితో క్లుప్తంగా మాట్లాడారు.
“హైకోర్టు తీర్పు కాపీని నేను ఇంకా అధ్యయనం చేస్తున్నా. అయితే దీనిపై మళ్ళీ న్యాయపోరాటం చేయాలనుకోవడం లేదు. ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా నేను తప్పకుండా పోరాడుతాను. సమయం వచ్చినప్పుడు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతాను,” అని చెప్పారు.
అనర్హత వేటు పడితే ఆరేళ్ళపాటు మరే ఎన్నికలలో పోటీ చేయలేరనే విషయం దానం నాగేందర్‌కు తెలియదనుకోలేము. బహుశః అందువల్లే ఉప ఎన్నికలలో పోరాడుతానన్నారు కానీ పోటీ చేస్తాననలేదు. పార్టీ నిర్ణయించిన అభ్యర్ధి తరపున అయన పోరాడుతారా లేదా తన కుటుంబం నుంచి లేదా తన అనుచరులలో ఎవరికైనా టికెట్ ఇప్పించుకొని పోరాడుతారా?అనే విషయం త్వరలో ఆయన నోటితోనే వింటాము.