తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేసీఆర్ హయంలో ఏకధాటిగా 53 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మె తర్వాత అయన ఆర్టీసీలో కార్మిక సంఘాలన్నిటినీ అనధికారికంగా నిషేదించారు. అప్పటి నుంచి అంటే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీసీలో కార్మిక సంఘాలకు పూర్తి స్వేచ్చ లభించింది. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది.
దాని ప్రకారం ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 22న ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేస్తారు. దానిపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తర్వాత 25న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
ఆ తర్వాత ఈ నెల 26న ఈ ఎన్నికలలో పోటీ చేయబోతున్న కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు.అక్టోబర్ 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 17వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, ప్రభుత్వం నుంచి బకాయిల విడుదల, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వైద్య సదుపాయాలు, నియామకాలు తదితర అంశాలు ఈ ఎన్నికల అజెండా కాబోతున్నాయి. కనుక ఈ ఎన్నికలలో గెలిచిన గుర్తింపు కార్మిక సంఘంపై కార్మికుల నుంచి చాలా ఒత్తిడే ఉంటుంది.