సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు సిద్ధిపేట జిల్లా రెవెన్యూ సిబ్బంది వెంటనే రంగంలో దిగి నేడు ఎర్రవల్లిలో సర్వే నంబర్ 325లో భూముల సర్వే ప్రారంభించారు.
మరోపక్క మర్కుక్ తహసీల్దారు కార్యాలయంలో సిబ్బంది ఎర్రవల్లి భూముల రికార్డులు బయటకు తీసి, వాటి ఆధారంతో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు.
అయితే ఎర్రవెల్లి గ్రామస్తులలో కొందరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి మా తాత ముత్తాతల కాలం నాటి భూములు. కానీ ఒకప్పుడు నీటి వసతి లేక మా భూములు బీడు వారాయి. కేసీఆర్ ఇక్కడకు వచ్చిన తర్వాత చెరువు తవ్వించి నీళ్ళు తెప్పించాక పంటలు పండించుకుని సుఖంగా బ్రతుకుతున్నాం.
మీ రాజకీయాల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు,” అంటూ గ్రామస్తులు సర్వే చేస్తున్న సిబ్బందితో వాగ్వాదాలు చేస్తున్నారు.
కానీ నెల రోజులలోగా ఎర్రవల్లిలో కేసీఆర్ అధీనంలో ఉన్న భూములు లెక్కలు తేల్చకపోతే అధికారులపై చర్యలు తప్పవని సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో హెచ్చరించారు. కనుక రెవెన్యూ సిబ్బంది అవసరమైతే పోలీసుల సాయంతో అక్కడ సర్వే చేసేందుకు సిద్దమవుతున్నారు.
కనుక బీఆర్ఎస్ పార్టీ కూడా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించవచ్చు. కానీ అడ్డుకుంటే, సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమని అంగీకరించినట్లవుతుంది.
అడ్డుకోకపోతే ఒకవేళ కేసీఆర్ అధీనంలో అసైన్డ్, ప్రభుత్వ భూములున్నట్లు తేలితే అది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. కనుక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుందనిపిస్తోంది.