కేసీఆర్‌ పుట్టుకతోనే ధనవంతుడా? మరి ఈ అఫిడవిట్ల కథేమిటి?

September 17, 2026


img

కేసీఆర్‌ కుటుంబం భూముల వ్యవహారంపై సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన సంచలన ప్రకటన, ఫామ్‌హౌసు భూముల విచారణకు ఇచ్చిన ఆదేశాలు బీఆర్ఎస్‌ పార్టీని కలవరపరచడం సహజం. అయితే కేటీఆర్‌, హరీష్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి వంటి కొందరు బీఆర్ఎస్‌ నేతలు మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నప్పటికీ, ఈ క్రమంలో వారు మాట్లాడిన మాటలు కూడా బెడిసికొడుతున్నాయి. 

తన తండ్రి పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు, తమ కుటుంబానికి ఎప్పటి నుంచో వందల ఎకరాలు ఉన్నాయని చెప్పిన నోటితోనే తమ కుటుంబానికి హైదరాబాద్‌ ఒక చిన్న ఇల్లు కూడా లేదని కనుక అందరూ తలో చోట ఇళ్ళు కట్టుకొని నివసించాల్సి వస్తోందని కేటీఆర్‌ అన్నారు. 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, “తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయి..? 

తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్ గారికి భూములు భారీగా పెరిగిన విషయం, స్వయంగా కేసీఆర్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ద్వారా స్పష్టమవుతుంది. 

బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి, కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి..? ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా..! 

ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం.. పుట్టుకతోనే కేసీఆర్ గారికి వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న డ్రామారావు కేటీఆర్‌, ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు రాసి మోసం చేసారా? లేక, ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా...?” అంటూ ట్వీట్‌ చేస్తూ కేసీఆర్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


Related Post