విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళి తర్వాత సినిమాలో కూడా భార్యాభర్తలుగా నటిస్తున్న చిత్రం రణబాలి. ఈ సినిమాలో వారిరువురి పాత్రల పేర్లు రణబాలి జయమ్మ. ఏకధాటిగా ఆరు నెలలు విశ్రాంతి తీసుకోకుండా పని చేసి ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశామని తెలియజేస్తూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ట్వీట్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.
దానిలో రణబాలి జయమ్మలు పెళ్ళి దుస్తులలో వివాహ మండపం వద్ద నిలబడ్డారు. సుమారు ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ కథ జరిగినట్లు సినిమా తీస్తున్నారు కనుక ఆ కాలంలో నూతన వధూవరులు ఏవిధంగా ఉండేవారో ఈ పోస్టర్లో చూపారు.
విజయ్ దేవరకొండ గంభీరంగా ఉండగా, అతని పక్కన రష్మిక అమాయకంగా కనిపిస్తుంది. వారిని చూసినప్పుడు ఇతనే మన రౌడీ హీరోనా? నేషనల్ క్రష్ ఈమేనా? అని సందేహం కలుగుతుంది. పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. మరి ‘రణబాలి’ సినిమా ఎలా ఉంటుందో అక్టోబర్ 16న విడుదలైతే తెలుస్తుంది.
టీజర్‌లో 1876-78 సంవత్సరాల మధ్య కాలంలో బ్రిటిష్ వారి పాలనలో ప్రాణాలు కోల్పోయిన 80 లక్షల మంది స్మ్రుత్యర్యర్ధం అంటూ నాటి దయనీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపారు. బ్రిటిష్ వారి దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడి కథే రణబాలి. ఈ సినిమాలో దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.
గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి 5 భాషల్లో నిర్మిస్తున్న రణబాలి అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.