తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బుధవారం శాసనసభలో కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ కలిపి అధికారికంగా అంటే వారి పేర్లతో రిజిస్టర్ అయినవి సుమారు 440 ఎకరాలున్నాయని శాసనసభలో ప్రకటించారు.
వీటిలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు మహబూబ్‌నగర్‌లో 14 ఎకరాలు, ఆమె భర్త అనిల్ కుమార్ పేరిట 23 ఎకరాలున్నాయని తెలిపారు. ఇద్దరికీ కలిపి మొత్తం 47 ఎకరాలున్నాయని తెలిపారు.
దీనిపై మొట్ట మొదట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే..
“ఎన్నికల అఫిడవిట్ లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తాను.
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నా కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు అబద్ధాలు చెప్పారు అసలు ఈ ముఖ్యమంత్రి పైనే మాకు నమ్మకం లేదు.. అసెంబ్లీలో ఈరోజు సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి.
గుంపు మేస్త్రీ-గుంటనక్క ముమ్మాటికీ కలిసే ఉన్నారని మరోమారు స్పష్టం చేస్తున్న. సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ గారి ఫామ్‌హౌసులో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్న.
ప్రభుత్వ నిబంధనలను మించి ఒక్క గజం భూమి నాకు ఎక్కువగా ఉన్న.. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న దానికన్నా గజం భూమి అదనంగా ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని మరోమారు స్పష్టం చేస్తున్నాను,” అని కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.