తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం మూడు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
దీనికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) డీఎస్ లోకేశ్‌కుమార్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు దీనిలో సభ్యులుగా ఉంటారు.
ఈ 22ఏ నిషేధిత భూముల జాబితాతో ముడిపడున్న భూములు, ఆస్తులు వ్యవహారాలతో పాటు ఈ చట్టంలో ఉన్న లోపాలను కూడా పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ 22ఏ జాబితాలో భూములకు సంబంధించి మొత్తం 12 రకాల సమస్యలను పరిశీలించనుంది. భూముల రికార్డులు, నిషేధిత జాబితాలో చేరిన తీరును పరిశీలించి, వాటిని ఈ జాబితాలో ఎందుకు చేర్చారో, వాటిని కొనసాగించాలా లేక జాబితాలో నుంచి తొలగించాలా? అని పరిశీలించి ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేస్తారు.
గతంలో చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగిన భూములు, కోర్టు ఆదేశాలతో హక్కులు పొందిన ఆస్తులు కూడా ఈ 22ఏ జాబితాలోకి రావడంతో యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
దీనిపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో బయట కూడా ఈ 22ఏ చట్టం పేరుతో ప్రభుత్వంలో కొందరు అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమై, ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
కనుక ఈ సమస్యలన్నిటిపై ఈ కమిటీ అధ్యయనం చేసి నెల రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. దాని నివేదిక ఆధారంగా 22ఏ భూముల విషయంలో ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది.