ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసి, ఆయన సీటు ఖాళీ అయ్యిందని ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు. అయితే దానం నాగేందర్ విషయంలో ఇలా జరుగవచ్చని ఊహిస్తున్నదే.
కానీ మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల సంగతి? అని సందేహం కలుగవచ్చు. వారిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు కనుక ఆయన సేఫ్. మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.
వారి వేతనాల నుంచి నెలకు రూ.5,000 బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో జమా అవుతోంది. శాసనసభ రికార్డులలో కూడా వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే నమోదు అవుతోంది. కనుక సాంకేతికంగా కూడా వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లే లెక్క. వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం, కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతుండటం వంటివి కోర్టులు సాక్ష్యాలుగా పరిగణించవు. కనుక బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కండువాలు కప్పుకున్న మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు న్యాయపరంగా ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు.
దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బీఫారం మీద లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసినందున ఫిరాయింపుల చట్టంలో అడ్డంగా దొరికిపోయారు.
దానం నాగేందర్ సీటు ఖాళీ అయినట్లు హైకోర్టు ప్రకటించడంతో అప్పుడే ఉప ఎన్నికలలో ఆ సీటు కోసం మూడు ప్రధాన పార్టీలలో ఆశావాహులు టికెట్ కోసం సిద్ధం అవుతున్నారు. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ ఇంకా స్పందించాల్సి ఉంది.