నేడు కాంగ్రెస్ నేతలు బస్సులో రంగారెడ్డి జిల్లాలోని కేటీఆర్‌కు చెందిన జన్వాడ ఫామ్‌హౌసు పర్యటన తీవ్ర ఉద్రిక్తంగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పక్కకు తప్పించి కాంగ్రెస్ నేతల బస్సుకు మార్గం ఏర్పరిచారు.
జన్వాడ ఫామ్‌హౌసు బస్సు యాత్రలో సీనియర్ కాంగ్రెస్ నేతలు, ఎంపీలు మల్లు రవి, అనిల్ రావిపూడి యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతల పర్యటనలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా జన్వాడ ఫామ్‌హౌసుకు వెళ్ళే మార్గంలో, పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మొహరించారు.
అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు ఆ ఫామ్‌హౌసు నిర్మించిన ప్రాంతంలో తిరుగుతూ స్థానిక ప్రజలతో మాట్లాడి ఆ ప్రాంతం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, “మేము ఇక్కడకు దండయాత్రకు వచ్చామని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. కానీ మేము ఒక మంచి ఉద్దేశ్యంతో వచ్చాము.
ఈ ఫామ్‌హౌసు భూములన్నీ సత్యం రామలింగరాజువి. గత ప్రభుత్వం వీటిని 111 జీవో జారీ చేసి స్వాధీనం చేసుకొని తమ పార్టీ వాళ్లకు కట్టబెట్టిందని మాకు తెలిసింది. కనుక నిజానిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడికి వచ్చాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. కానీ ఈ భూములు, వీటిలో ఈ ఫామ్‌హౌసు గురించి నిగ్గు తేల్చమని హైడ్రాని కోరుతాము,” అని ఎంపీ మల్లు రవి అన్నారు.