వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై శాఖాహారం, మాంసాహారాలను సూచించే గ్రీన్ లేదా రెడ్ చుక్కలు ముద్రించడం తప్పనిసరి చేసింది.
ఇకపై సబ్బులు, షాంపులు, టూత్ పేస్టు, మహిళల మేకప్‌కు ఉపయోగించే లిప్ స్టిక్ వంటి వివిధ ఉత్పత్తులపై కూడా గ్రీన్, రెడ్ లేదా బ్రౌన్ కలర్ చుక్కలు ముద్రించడం తప్పనిసరి చేసింది.
వాటిలో కూడా జంతువుల కొవ్వు, కొవ్వు నుంచి తీసిన నూనెలు వగైరా కలుపుతున్నారనే పిర్యాదుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిని ఖచ్చితంగా అమలుచేయాలని ఆదేశించడంతో పాటు అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు దీని అమలుని పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించింది.
ఇంతకాలం మీ టూత్ పేస్టులో ఉప్పుందా? బొగ్గుందా? వంటి ప్రకటనలు చూశాం. ఇకపై మీ సబ్బులు, టూత్ పేస్టులు శాఖహారమేనా? అనే ప్రకటనలు చూస్తామేమో?