రెండు రోజుల క్రితమే ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించడం తప్పదని స్పష్టం చేశారు. ఈరోజు అందుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007 బిల్లు సవరణకు ఆమోదం తెలిపింది. దీనిపై ఎటువంటి చర్చ జరుపకుండా వాయిస్ ఓటుతో ఆమోదం తెలిపింది. కనుక రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం, వెంటనే అమలులోకి రావడం లాంచనప్రాయమే.
దీంతో ఇకపై యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై బ్యాంకులు, ఫోన్ పే, పేటిఎం వంటి ఫిన్ టెక్ సంస్థలు కొంత మొత్తం ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతించినట్లయింది. అయితే రూ.2,000 అంతకు మించి లావాదేవీలపై కొంత ఛార్జీ వసూలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. భారీగా లావాదేవీలు నిర్వహించే పెద్ద వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలపై ఎటువంటి అదనపు భారం పడదని చెపుతున్నారు.
కానీ మన దేశంలో ఇలాంటి హామీలను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సామాన్య ప్రజలపై ఇప్పటికిప్పుడు యూపీఐ ఛార్జీల భారం వేయకపోయినా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ భారం చివరికి సామాన్య ప్రజలపైనే పడవచ్చు.