తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్ళు పూర్తయినా రాష్ట్రంలో కొత్తగా మరో విమానాశ్రయం ఏర్పాటుకాలేదు. కారణాలు అందరికీ తెలుసు. అయితే సిఎం రేవంత్ రెడ్డి చొరవతో ఇప్పుడీ కల సాకారం కాబోతోంది.
రెండేళ్ళలోగా వరంగల్ అంతజాతీయ విమానాశ్రం నిర్మాణం పూర్తిచేసి విమానసేవలు అందుబాటులోకి తెస్తానని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రెండుమూడు నెలల క్రితమే ప్రకటించారు.
విమానాశ్రయానికి భూసేకరణ పూర్తవడంతో ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయ నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి వాటిలో రెండింటికి టెండర్లు పిలిచి ఖరారు చేసింది.
మొదటి ప్యాకేజీలో విమానాశ్రయం ఏర్పాటవుతున్న 953 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచి గుత్తేదారులను ఖరారు చేసింది.
రెండో ప్యాకేజీలో భాగంగా విమానాల రన్ వే, పార్కింగ్ అప్రాన్, టాక్సీవే, నగరం నుంచి విమానాశ్రయాన్ని కలుపుతూ కొత్తగా రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లు ఖరారు చేసింది. ఈ రెండు పనులకు మొత్తం రూ. 203.49 కోట్లు ఖర్చు చేయబోతోంది.
ఇక మూడో ప్యాకేజీలో రూ.213.59 కోట్లు వ్యయంతో విమానాశ్రయం టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, విద్యుత్ సబ్ స్టేషన్, ఫైర్ సర్వీస్ స్టేషన్, ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వగైరా నిర్మించేందుకు టెండర్లు పిలువబోతోంది.
ఈ టెండర్లు కూడా ఖరారు చేసిన తర్వాత డిసెంబర్‌లో వరంగల్ విమానాశ్రయానికి భూమిపూజ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిభింబించే విధంగా అద్భుతంగా నిర్మించబోతున్న ఈ విమానాశ్రయానికి తగిన పేరు సూచించాల్సిందిగా సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పలువురు స్పందిస్తూ సమ్మక్క-సారలమ్మ లేదా రాణీ రుధ్రమ లేదా కాకతీయ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టాలని సూచిస్తున్నారు. కనుక శంకుస్థాపన చేసేలోగా విమానాశ్రయానికి పేరు కూడా ఖరారు చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.