జూరాల నీటిని ఎందుకు విడుదల చేయరు?

September 20, 2026
img

జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు రోడ్లపై కూర్చొని నిరసనలు తెలిపారు. కొందరు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కూర్చొని ధర్నా చేస్తూ తక్షణం జూరాల నుంచి నీళ్ళు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

కానీ అధికారులు స్పందించకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారులను నమ్ముకుంటే తమ పంటలు కాపాడుకోలేమని భావించిన రైతన్నలు జూరాల ప్రాజెక్టు వద్దకు వెళ్ళి ఎడమ కాలువ రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తి నీళ్ళు విడుదల చేసుకున్నారు. 

జూరాల ఎడమ కాలువపైనే పాలమూరులో సుమారు 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ మార్గంలో సుమారు 150కి పైగా చెరువులు నిండుతాయి. ఆ చెరువులపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేసుకుంటారు.

జూరాల ఎడమ కాలువ ద్వారా విడుదల చేసే నీళ్ళే 300కి పైగా గ్రామాలకు ప్రధాన తాగునీటి వనరు. వనపర్తి, ఆత్మకూరు, పెబ్బేరు, కొత్తకోట మున్సిపాలిటీల పరిధిలో ప్రజలకు కూడా ఇదే ఆధారం. ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని వేలమంది ప్రజలకు నిత్యావసరమైన జూరాల నీటిని విడిచిపెట్టడం లేదంటూ రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రైతన్నలే గేట్లు ఎత్తి నీళ్ళు విడుదల చేసుకోవడంతో అధికారులు అప్రమత్తమై, మళ్ళీ గేట్లు మూసివేయించి అక్కడ భారీగా పోలీసులను మొహరించారు. దీంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇంకా స్పందించాల్సి ఉంది. 


Related Post