ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో విద్యుత్ ప్రమాదం

September 22, 2026
img

ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ జరగడంతో కళ్ళు తెరవని పసికందులను ఉంచే  ఎస్ఎన్‌సీయూ వార్డులో ఏసీ పేలిపోయింది. దీంతో ఆ వార్డులో పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇచ్చోడ చెందిన దంపతుల 5 రోజులు వయసున్న పసిబిడ్డ చనిపోయింది. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

ప్రమాదం జరిగినప్పుడు ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న అంబులెన్స్ సిబ్బంది వార్డులోని 27 మంది పసిబిడ్డలను బయటకు తరలించారు. ముందుగా తలుపులు తెరిచి, కిటికీ అద్దాలు పగులగొట్టడంతో గదిలో పొగ అంతా బయటకు పోయేలా చేశారు. ఆస్పత్రి విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దాంతో ఆ చీకటిలోనే పసిబిడ్డలను తల్లితండ్రులు, సిబ్బంది బయటకు తీసుకువెళ్ళారు. అంబులెన్స్ డ్రైవర్లు తల్లితండ్రులు కలిసి 27 మంది పసిబిద్దలను రిమ్స్ సమీపంలోని సురక్ష ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. 

సమాచారం అందగానే జిల్లా కలెక్టర్ రాజర్షి షా అక్కడకు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఈ ఘటనపై సిఎం రేవంత్‌ రెడ్డి వెంటనే స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. పసిబిడ్డల మృతి పట్ల వారి తల్లితండ్రులకు సంతాపం తెలియజేశారు.

Related Post