సిద్ధిపేట జిల్లా, మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాలలో వరుసగా మూడు రోజులు భూములు సర్వే జరిపిన రెవెన్యూ అధికారులు, సర్వే పూర్తయిన తర్వాత ఎర్రవల్లి గ్రామానికి చెందిన వంద మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. వారిని తమ భూములకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలతో హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. తర్వాత మిగిలిన రైతులకు కూడా నోటీసులు ఇచ్చి ఎర్రవల్లి భూముల లెక్క తేల్చనున్నారు.
ఈ మూడు రోజుల్లో సర్వే నంబర్: 325 పరిధిని పరిశీలించి, భూముల హద్దులను గుర్తించారు. సోమవారం బౌండరీ మార్కింగ్ పూర్తయిన తర్వాత, రైతుల భూములకు సంబంధించిన పత్రాలతో వాటిని సరిపోల్చి ఆయా భూముల వివరాలను రికార్డులలో నమోదు చేయనున్నారు.
ఎర్రవల్లి భూముల వ్యవహారాన్ని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తునందున, రెవెన్యూ అధికారులు, సిబ్బంది కూడా క్షణం విశ్రాంతి తీసుకోకుండా క్షేత్రస్థాయిలో తిరుగుతూ సర్వే పనులు చేస్తూనే ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.
ఒకవేళ ఈ సర్వేలో మాజీ సిఎం కేసీఆర్ ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నట్లు నిర్ధారిస్తే, ఆయనతో సహా బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. ఒకవేళ అటువంటి ఆక్రమణలు లేవని నిర్ధారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డి విమర్శలపాలవుతారు.
కనుక రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఎర్రవల్లి గ్రామస్తుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారిందని చెప్పవచ్చు.