సిఎం రేవంత్‌ రెడ్డికి నెల రోజులు గడువిస్తున్నా: కవిత

September 23, 2026


img

మొన్న అదిలాబాద్ ‘రిమ్స్’లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు పసిబిడ్డలు మరణించగా మరో 22 మంది సురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు హాస్పిటల్‌కు వెళ్ళి, పసిబిడ్డల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. 

తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రమాదంలో ఐదుగురు పసిబిడ్డలు చనిపోతే, ఇంతమంది గాయపడితే వారి తల్లితండ్రులను పరామర్శించడానికి సిఎం రేవంత్‌ రెడ్డికి తీరిక లేదు. కానీ ఫుట్ బాల్ మ్యాచులు ఆడేందుకు, ఢిల్లీ, విదేశీ పర్యటనలకు సమయం ఉంటుంది. రిమ్స్ హాస్పిటలలో కనీసం 150 ఏసీలున్నాయి. కానీ మరమత్తులు చేసేందుకు ఒక్క మెకానిక్ కూడా లేనందునే ఈ ప్రమాదం జరిగింది. 

రాష్ట్రంలో మిగిలిన ఆసుపత్రులలో కూడా దూది, బ్యాండేజ్, చివరికి చీపుర్లు, ఫినాయిల్ బాటిల్స్ కొనేందుకు కూడా డబ్బులేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.500 కోట్లు ప్రభుత్వం చెల్లించలేదు. కనుక పేదలకు ఆ సేవలు లభించడం లేదు. ఇకనైనా ప్రభుత్వాసుపత్రులకు అవసరమైన నిధులు, తక్షణం బకాయిలు విడుదల చేయాలి. ఆ వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. 

అలాగే మారుమూల ఆదివాసీ గ్రామాలకు రోడ్లు వేయించాలి. వీటన్నిటికీ నెలరోజులు గడువు ఇస్తున్నా. అప్పటికీ ప్రభుత్వం ఈ పనులు పూర్తిచేయకపోతే ఆదివాసీలతో కలిసి ధర్నా చేస్తాను,” అని కల్వకుంట్ల కవిత సిఎం రేవంత్‌ రెడ్డిని హెచ్చరించారు.


Related Post