న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రీమియర్ షో వేసుకునేందుకు, టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది.
జస్టిస్ శ్రవణ్ కుమార్ దీనిపై విచారణ చేపట్టి, ఈ దశలో ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోలేమని స్పష్టం చేశారు. కానీ ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని, కుదిరితే ఉపసంహరించుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి సూచించారు. ఈ కేసు తదుపరి విచారణని నాలుగు వారాలకు వాయిదా వేశారు.
అయితే హైకోర్టు ఖరాఖండీగా వద్దని చెప్పలేదు కనుక ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవచ్చు. మళ్ళీ విచారణ చేపట్టే సమయానికి బహుశః ప్యారడైజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసినా ఆశ్చర్యం లేదు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నానికి జంటగా కాయదు లోహర్ నటించగా, మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదల కాబోతోంది.