గాయంపై కుక్క నాకితే.. రేబీస్‌తో బాలుడు మృతి!

September 25, 2026
img

కుక్క కరిస్తే రేబీస్‌ వ్యాధి సోకుతుందని, వెంటనే చికిత్స తీసుకోకపోతే మనుషులు చనిపోతారని అందరికీ తెలుసు. కానీ కుక్క తన నాలుకతో శరీరాన్ని నాకినా రేబీస్‌ సోకి చనిపోతారంటే నమ్మశక్యం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌, పల్నాడు జిల్లాలో ఈపూరు మండలంలోని ఓ రెండేళ్ళ బాలుడు రుద్రాన్ష్ ఆవిధంగానే రేబీస్‌తో మృతి చెందాడు. 

అది వారి పెంపుడు కుక్కే. కనుక అది అతనిని కరవలేదు. కానీ బాలుడి ముఖంపై ఉన్న గాయాన్ని నాకడంతో దాని లాలాజలం ద్వారా బాలుడికి రేబీస్‌ వ్యాధి సోకింది.

అయితే బాలుడి ఒంటిపై కుక్క కొరికిన గాట్లు లేవు. ఈ వ్యాధి లక్షణాలు కాస్త ఆలస్యంగా బయటపడతాయి. కనుక బాలుడికి రేబీస్‌ వ్యాధి సోకినట్లు తల్లితండ్రులు గుర్తించలేకపోయారు.

గుర్తించిన వెంటనే చికిత్స కోసం వైద్యుల వద్దకు తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే వ్యాధి ముదిరిపోయింది. ఆ దశలో చికిత్స చేసినా ఫలించదు. కనుక అంతవరకు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లితండ్రుల కళ్ళెదుటే ఆ చిన్నారి రేబీస్‌ వ్యాధి లక్షణాలతో చనిపోయాడు. 

కనుక ఇంట్లో పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా రేబీస్‌ టీకాలు వేయించాలి. వీధి కుక్కలకు ఎటువంటి టీకాలు వేయరు. వాటిలో రేబీస్‌ వ్యాధి ఉన్నా లేకపోయినా వాటితో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. లేకుంటే ఇటువంటి విషాదాలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Related Post