ప్రభుత్వానికి, ప్రతిపక్షాల మద్య నిరంతరం విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్ళు ప్రతిసవాళ్ళు సర్వ సాధారణమే. కానీ గత కొన్నేళ్లుగా పోలీస్ అధికారులపై కూడా ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. మేము అధికారంలోకి వస్తే మీ తాట తీస్తామని బెదిరిస్తున్నారు.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా విసి సజ్జనార్‌కు ఇలాగే వార్నింగ్ ఇచ్చారు.
వినాయక నిమజ్జన ఊరేగింపులలో రాజకీయ పార్టీలు, వాటి నాయకులను పొగుడుతూ పాటలు పెట్టవద్దని, గణేష్ నిమజ్జనాలను సంప్రదాయబద్దం నిర్వహించుకోవాలని విసి సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అలాగే నిమజ్జన కార్యక్రమాలలో డిజేలు పెట్టి పెద్ద శబ్దాలతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని విసి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. భక్తి, ఆధ్యాత్మిక చింతనతో సాగాల్సిన ఈ నిమజ్జన కార్యక్రమాలలో ఉద్రిక్తతలు ఏర్పడకూడదనే సడుదేశ్యంతోనే విసి సజ్జనార్ నగర ప్రజలకు ఈ విజ్ఞప్తి చేశారు.
కానీ పాడి కౌశిక్ రెడ్డి ఇందుకు విసి సజ్జనార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మా నాయకుడు కేసీఆర్ పాటలు పెట్టుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు? నువ్వు పోలీస్ అధికారివా లేక రాజకీయ నాయకుడివా?
రెండేళ్ళ తర్వాత ఎలాగూ రిటైర్ అయిపోతాను కదాని ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్న కాలర్ పట్టుకొని లాకొచ్చి తాట తీస్తాం బిడ్డా ఏమనుకుంటున్నావో, అంటూ విసి సజ్జనార్‌కు వార్నింగ్ ఇచ్చారు.
పోలీసులు, వారి ఉన్నతస్థాయి అధికారులు ఇటు ప్రభుత్వంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులకు, అధికార పార్టీ నేతలకు విధేయంగా పనిచేయాలి. అటు ప్రతిపక్షాల ఇటువంటి బెదిరింపులకు భయపడుతూ పనిచేయాలి. పరిస్థితి ఈవిధంగా ఉంటే, అధికారులు ధైర్యంగా ఎలా పనిచేయగలరు?