సుప్రీం తీర్పు గౌరవిస్తా.. ఉప ఎన్నికలలో పోటీ చేస్తా!

September 24, 2026


img

సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందన చాలా విచిత్రంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని చెపుతూనే తన రాజకీయ భవిష్యత్తును ప్రజల మధ్యే తేల్చుకుంటానని, ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏ పార్టీ తరపున పోటీ చేస్తానో ప్రకటిస్తానన్నారు. తాను మొదటి నుంచి ప్రజల మద్య, ప్రజల కోసం పనిచేశానని, కనుక ఇకపై కూడా ప్రజల కోసమే పనిచేస్తానన్నారు. 

అనర్హత వేటు పడక ముందే అయన తన పదవికి రాజీనామా చేసి ఉండి ఉంటే, సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఉండేది కాదు. కానీ సుప్రీంకోర్టులో అయన తరపు న్యాయవాది దానం నాగేందర్‌ నేటికీ బీఆర్ఎస్‌ పార్టీలోనే  ఉన్నారని న్యాయమూర్తులను నమ్మించే ప్రయత్నం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ టికెట్ మీద పోటీ చేసి, బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని చెప్పడాన్ని న్యాయమూర్తులు కూడా ఆక్షేపించారు. ఫిక్స్ డిపాజిట్ వంటి ఎమ్మెల్యే పదవి ఉండగా, స్టాక్ మార్కెట్ వంటి ఎంపీ పదవి కోసం ఆరాట పడితే ఉన్న ఫిక్స్ డిపాజిట్ కూడా పోగొట్టుకున్నారంటూ న్యాయమూర్తి వ్యంగ్యంగా అన్నారు. 

అనర్హత వేటు పడితే ఆరేళ్ళపాటు మరే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిసి ఉన్నా, ఉప ఎన్నికలలో పోటీ చేస్తానని దానం నాగేందర్‌ చెప్పడమే వింత అనుకుంటే, కాంగ్రెస్‌లో ఉంటూ ఏ పార్టీ తరపున పోటీ చేస్తానో తర్వాత చెప్తాననడం ఇంకా విచిత్రమే కదా? 


Related Post