తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వరుస దాడులలో బయటపడుతున్న ఉన్నతస్థాయి అధికారుల ఆస్తులు, రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ళలోనే అవినీతి ఎంతగా వ్యాపించిందో స్పష్టం చేస్తోంది.
మొన్న నీమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో సోదాలు జరుపగా సుమారు రూ.70 కోట్లు విలువగల ఆస్తులు బయటపడ్డాయి.
తాజాగా మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సంబంధించినట్లు అనుమానిస్తున్న ఎనిమిది మంది బినామీలకు చెందిన పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
పుప్పాలగూడలో కాంట్రాక్టర్ బొమ్మ వెంకటేశ్ ఇంట్లో రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే భీమ్‌రెడ్డి కేసులో సుమారు రూ.300 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించినట్లు ఏసీబీ దర్యాప్తు వెల్లడించింది. ఆస్తుల్లో కొంత భాగం బినామీల పేర్లపై ఉన్నట్లు అనుమానిస్తూ విచారణ కొనసాగుతోంది.
సెప్టెంబర్‌లో ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఆస్తుల యాజమాన్యం, నగదు లావాదేవీలపై దృష్టి పెట్టింది.
భీమ్‌రెడ్డి కేసు ఒక్కటే కాదు.. ఈ ఏడాది సీనియర్ పోలీసు అధికారులు, ఇంజినీర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్లు, ఎక్సైజ్ అధికారులపై కలిపి మొత్తం 14 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్లలోనే ప్రభుత్వాలు నడిపిన రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఇంతగా అవినీతికి పాల్పడుతుంటే.. ఇందుకోసమేనా కోట్లాడి, బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.