తెలంగాణలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్ధులుగా ఖరారు చేసింది.
ఈ మేరకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన వెలువడటంతో వారిరువురి పేర్లు అయన సిఫార్సు చేసినట్లు భావించవచ్చు.
వీరిలో సామ రామ్మోహన్‌రెడ్డి చాలాకాలంగా టీపీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. మరో అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తనయుడు.
రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల కానుంది.
అభ్యర్థుల విషయంలో ఎప్పుడూ ఆలస్యం చేసే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇంత ముందుగా ప్రకటించడం చూస్తే, ఎట్టి పరిస్థితులలో ఈ రెండు సీట్లు కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు భావించవచ్చు.