దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి కోల్పోవడంతో ఖాళీ అయిన ఖైరతాబాద్ స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరుగుతుంది. కనుక దానిపై కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే మాట్లాడటం మొదలుపెట్టాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడారు. ఆ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పోటీ తప్పకుండా చేస్తుందని చెప్పారు.
ఈరోజు తన పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ, ఆమె స్వయంగా ఈ విషయం చెప్పారు. ఖైరతాబాద్ నుంచి తాము పోటీ చేస్తామని అయితే అభ్యర్ధి ఎవరనేది పార్టీలో చర్చించుకొని నిర్ణయించుకున్నాక ప్రకటిస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నేతల భూములపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఇదంతా తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు చేస్తున్న కాలక్షేపమే. ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు.
ఇదివరకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అంటూ చాలా కమీషన్లు వేసి చివరికి ఏం చేశారు? ఇది అలాగే. కొన్ని రోజులు రెండు పార్టీలు ఈ పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతాయి. ఆ తర్వాత రెండు పార్టీల నేతలు సెటిల్ చేసుకున్నాక దీనినీ పక్కన పడేస్తారు.
నా ఫామ్‌హౌసులో అసైన్డ్ భూములు లేవు. కబ్జాలు లేవు. చెరువులో కట్టుకోలేదు. అంతా చట్టబద్దంగానే నిర్మించుకున్నాను. నా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దానికంటే ఒక్క రూపాయి ఎక్కువున్నా తీసేసుకోవచ్చని నేను ముందే చెప్పాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.