కేటీఆర్ అడ్డాలో రేవంత్ సభ రేపే.. కానీ దేనికి?

September 29, 2026


img

సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 30న సీఎం హోదాలో తొలిసారి సిరిసిల్లలో పర్యటించనున్న రేవంత్‌రెడ్డి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 

రగుడు బైపాస్ సమీపంలో నిర్వహించనున్న ఈ సభకు సుమారు లక్ష మందిని సమీకరించేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం పర్యటన కేవలం అభివృద్ధి పనుల కొరకు చేస్తున్న అధికారిక పర్యటన కాదని అందరికీ తెలుసు.

కేటీఆర్ అడ్డాలోనే భారీ జనసమీకరణతో సభ నిర్వహించి తమ బలాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ ఉద్దేశ్యం. కనుక ఈ సభలో సిఎం రేవంత్‌ రెడ్డి కల్వకుంట్ల కుటుంబంపై మళ్ళీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఖాయం. ముఖ్యంగా కేటీఆర్‌ గురించి ఆయనేం మాట్లాడుతారనేది ఆసక్తికరం.   

ఈ పర్యటనలో సుమారు రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు కూడా సిఎం రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.

సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో సిరిసిల్లలో సీఎం సభ ఎలా సాగుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


Related Post