మేడారం మినీ జాతర తేదీలు ఖరారు

September 27, 2026
img

రెండేళ్ళకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర మద్య ప్రతీ ఏటా మినీ జాతర జరపడం ఆనవాయితీ. కనుక మేడారం ఆలయ పూజారులు 2027లో జరగబోయే మినీ జాతర తేదీలపై చర్చించి ఖరారు చేశారు.  

వారు తెలిపిన సమాచారం ప్రకారం 2027, ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు ఈ మినీ జాతర జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను కూడా వారు ప్రకటించారు. 

ఫిబ్రవరి 17, 18 తేదీలలో సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. మర్నాటి నుంచి అంటే ఫిభ్రవరి 19 నుంచి భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవచ్చు. ఫిభ్రవరి 20న జాతర ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి. 

మేడారం మహాజాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సుమారు కోటి మంది భక్తులు తరలివస్తుంటారు. మద్యలో జరిగే మినీ జాతరకు కూడా లక్షాలాది మంది భక్తులు తరలి వచ్చి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.

కనుక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు 5-6 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారు.

జాతర తేదీలు ఖరారు కావడంతో రెండు మూడు నెలల ముందు నుంచే భక్తులు దర్శనాలకు వస్తుంటారు. కనుక టీజీఎస్ ఆర్టీసీ కూడా ఇప్పటి నుంచే ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

Related Post