ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘ఏకం’ సంస్థ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (77) చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
అయన అసలు పేరు విజయకుమార్ నాయుడు. తమిళనాడులో జన్మించారు. మొదట ఎల్ఐసీ ఏజెంట్‌గా ఆ తర్వాత కొంతకాలం ఉపాధ్యాయుడుగా పనిచేసిన అయన 80వ దశకంలో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ‘జీవాశ్రమం’ గురుకుల పాఠశాల స్థాపించారు.
ఆ తర్వాత ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వేసి 1992లో తమిళనాడులోని తిరువళ్ళూరులో తనని తాను ‘కల్కి’ అవతారమంటూ ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ‘కల్కి భగవాన్’గా ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత తన సతీమణిని ‘అమ్మ భగవాన్’గా పరిచయం చేసి ఇద్దరూ కలిసి ఆధ్యాత్మిక భోధనలు చేశారు.
క్రమంగా దేశవిదేశాల నుంచి భక్తుల సంఖ్య, విరాళాలు పెరిగాయి. ఆ తర్వాత తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి పాలరాతితో ‘ఏకం-గోల్డెన్ సిటీ’ నిర్మించుకున్నారు. అక్కడే ఉంటూ తన ఆధ్యాత్మిక భోధనలు కొనసాగించారు.
కల్కి భగవాన్ దంపతులకు కృష్ణాజీ అనే ఓ కుమారుడు ఉన్నారు. ఆయన, ఆశ్రమ ప్రతినిధులు, శిష్యులు కలిసి కల్కి భగవాన్ భౌతిక కాయాన్ని గోల్డెన్ సిటీకి తరలించారు. బుధవారం మధ్యాహ్నం వరకు భక్తులు, శిష్యులు నివాళులు అర్పించిన తర్వాత గోల్డెన్ సిటీలోనే ఆయన భౌతికకాయాన్ని సమాధి చేస్తారు.