దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం ఫ్లైట్ నంబర్ ఎఫ్‌జెడ్-1073లో బుధవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. విమానం సుమారు 36,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కో-పైలట్ హటాత్తుగా కత్తితో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేశాడు.
ఊహించని ఆ ఘటనతో మొదట తీవ్ర దిగ్బ్రాంతి చెంది తీవ్రంగా గాయపడినప్పటికీ, కో పైలట్‌ను శాయశక్తుల అడ్డుకుంటూ కాక్‌పిట్ తలుపు తెరిచారు. కాక్‌పిట్‌లో జరిగిన ఈ యుద్ధం వలన కేవలం 30 సెకన్లలో విమానం సుమారు 14,000 అడుగుల కిందకు దిగిపోయింది.
దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులలో కొందరు గాయపడ్డారు. అయితే స్మిత్ మచ్ఛార్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో పరిస్థితిని గమనించిన కొందరు ప్రయాణికులు, సిబ్బంది వెంటనే లోనికి ప్రవేశించి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇటువంటి సందర్భాలలో విమానాన్ని సురక్షితంగా నడిపేందుకు మరో ఇద్దరు పైలట్లు విమానంలోనే ఉంటారు. ఫ్లై దుబాయ్ విమానంలో ఉన్న అదనపు పైలట్లు వెంటనే విమానాన్ని తమ అదుపులోకి తీసుకొని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలోని 174 మంది ప్రయాణికులున్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం వారిని మరో విమానంలో టెల్ అవీవ్‌కు తరలించారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌ను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని భారత్ రాయభార కార్యాలయం అధికారులు తెలిపారు. సౌదీ పోలీసులు కో-పైలట్‌ని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ముంబైకి చెందిన స్మిత్ మచ్ఛార్ స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయనకు బోయింగ్ విమానాలు నడపడంలో సుమారు 9,750 గంటల ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది.. అక్కడ సీనియర్ కమాండర్‌గా, లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా ఇతర పైలట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ 2022 జూన్‌లో ఫ్లై దుబాయ్‌లో కెప్టెన్‌గా చేరారు.
ఒకవేళ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ధైర్యంగా పోరాడలేకపోయినా, కాక్‌పిట్ తలుపు తెరవలేకపోయినా నిన్న ప్రపంచ వైమానిక చరిత్రలో మరో ఘోర దుర్గటన జరిగి ఉండేది. కనుక ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సహా అందరూ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌ని ప్రశంశిస్తున్నారు.