చిత్రగుప్తుడు చిట్టాలా.. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు

October 01, 2026


img

నరుల పాప పుణ్యాలు లెక్కలు వ్రాసే చిత్ర గుప్తుడు చిట్టా ఎన్నటికీ తరగదన్నట్లు, సిఎం రేవంత్‌ రెడ్డి బయటపెడుతున్న  కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఆస్తుల జాబితా కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బుధవారం సిరిసిల్ల సభలో సిఎం రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు చెందిన మరికొన్ని ఆస్తుల వివరాలు బయటపెట్టి ఇవన్నీ మీకెలా వచ్చాయి? హైటెక్ సిటీ వద్ద కేటీఆర్‌ కుటుంబానికి  400 గదులున్న మూడు ఫైవ్ స్టార్ హోటల్స్‌ ఉన్న మాట వాస్తవమా కాదా? చెప్పాలి. 

మీ కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు విలాసవంతమైన ఫామ్‌హౌసులున్న మాట నిజమా కాదా? కేసీఆర్‌ తోడల్లుడు రవీందర్ రావు, ఆయన కుమారుడు సంతోష్ రావులకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?

మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం కోసం ప్యాకేజీ ప్రకటిస్తే తాము కూడా నిర్వాసితులమేనంటూ రవీందర్ రావు, సంతోష్ రావు, సౌమ్యారావు భారీగా నష్టపరిహారం తీసుకున్న మాట వాస్తవమా కాదా? అంత ధనవంతులై ఉండి తెల్లరేషన్ కార్డు తీసుకున్నారు. మళ్ళీ దాంతో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్న మాట వాస్తవమా కాదా?

సంతోష్ రావుకి వందల ఎకరాల భూములు, ఫైవ్ స్టార్ హోటల్స్‌, టీవీ ఛానల్, న్యూస్ పేపర్ సంస్థలు ఏవిధంగా సంపాదించారు?       

మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అవినీతికి పాల్పడకపోతే, ఇన్ని వేలకోట్లు విలువగల ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పండి. మీ అందరి ఆస్తుల వివరాలు తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం కట్టబెడితే మీరు, మీ బంధుమిత్రులు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను నిలువు దోపిడీ చేశారు,” అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపణలను కల్వకుంట్ల కుటుంబ సభ్యులు, సంతోష్ రావు తదితరులు ఖండించగలరా? బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ఆరోపణలపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.     


Related Post