తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్‌బీసీ టన్నల్ పనులు 79 శాతం పూర్తయ్యాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత మీడియాకు ఎస్ఎల్‌బీసీ టన్నల్ పనుల పురోగతి గురించి వివరించారు. గత ఏడాది ఎస్ఎల్‌బీసీ టన్నల్లో ప్రమాదం జరిగి 8మంది చనిపోయారు. ఆ ప్రమాదంలో టన్నల్ బోరింగ్ మెషిన్ కూడా దెబ్బ తింది. కనుక కొన్ని నెలల పాటు పనులు నిలిచిపోయాయి.
మళ్ళీ ఆరు నెలల క్రితం టన్నల్ తవ్వకం పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 79 శాతం అంటే సుమారు 34.87 కిమీ పొడవున తవ్వకం పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఈ టన్నెల్లో అత్యంత ప్రమాదకరమైన ‘షియర్ జోన్’ దాటినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు ఏడున్నర మీటర్ల వరకు టన్నెల్ తవ్వకం పనులు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ నెలాఖరులోగా జర్మనీ నుంచి మరో ద్రిల్లింగ్ బూమార్, ఎలక్ట్రిక్ లోడర్లు, లోకోమోటివ్ వగైరా రానున్నాయి. అవి కూడా అందుబాటులోకి వస్తే తవ్వకం పనులు మరింత వేగం సాగుతాయి. కనుక మిగిలిన 9.1 కిమీ తవ్వకం పనులు బహుశః మరో మూడు నాలుగు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఎస్ఎల్‌బీసీ టన్నల్ నుంచి నీళ్ళు పారే అవకాశం ఉందని భావించవచ్చు.