తెలంగాణలో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్-2 నోటిఫికేషన్ విడుదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా టెట్ అర్హత కలిగి ఉండాలి. కనుక రాష్ట్ర ప్రభుత్వం టెట్-2 పరీక్షల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి అక్టోబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నవంబర్ 16 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 7న ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. అదే రోజు నుంచి ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది.
ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన ప్రత్యేక టెట్-1 ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. మొత్తం 22,477 మంది పరీక్షకు హాజరుకాగా..వారిలో 70.07 శాతం మంది అంటే 15,749 మంది ఉత్తీర్ణులయ్యారు.
అయితే టెట్-1లో ఫెయిల్ అయినవారు మళ్ళీ టెట్-2 పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా తగినంత సమయం ఉండేలా నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కనుక రెండు పరీక్షలకు మద్య కాస్త ఎక్కువ సమయం ఉండేలా ప్రభుత్వం టెట్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది.